అర్ధరాత్రి మురుగ ఇంటి ముందు పోలీసులు

తమిళనాడులో ‘సర్కార్’ వివాదం ముదురుతోంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను కించపరిచేలా ఉన్నాయని అధికార అన్నాడీఎంకే పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలని అన్నాడీఎంకే మంత్రులు బహిరంగంగా దర్శక, నిర్మాతలను హెచ్చరించారు. ఓ సినిమాపై ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగడంతో పరిస్థితి చాలా దూరం వెళ్లిపోయింది. గురువారం అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ‘సర్కార్’ ప్రదర్శితమవుతోన్న థియేటర్ల వద్దకు వెళ్లి ఆందోళనలు చేపట్టారు. సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. పోస్టర్లు, బ్యానర్లను చించేశారు.

ఇదిలా ఉంటే, అన్నాడీఎంకే చర్యలు కేవలం ఆందోళనతో ఆగలేదు. ఏకంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఇంటికే వెళ్లిపోయాయి. గురువారం అర్ధరాత్రి పోలీసులు తన ఇంటికి వచ్చారని, అనేక సార్లు తలుపు కొట్టారని మురుగదాస్ ట్వీట్ చేశారు. ‘అర్ధరాత్రి పోలీసులు నా ఇంటికి వచ్చారు. డోర్‌ను అనేకసార్లు కొట్టారు. నేను అక్కడ లేకపోవడంతో వెళ్లిపోయారు. ప్రస్తుతం నా ఇంటి బయట పోలీసులు లేరు’ అని మురుగదాస్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మురుగదాస్ ఇంటికి పోలీసులు రావడంపై తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘డైరెక్టర్ మురుగదాస్ ఇంటి ముందు పోలీసులా? ఎందుకు? అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని అనుకుంటున్నాను. మళ్లీ చెబుతున్నాను.. సెన్సార్ పూర్తయిన సినిమా, ఇప్పటికే ప్రజలు చూసేశారు. ఇక ఎందుకు మీ దండోరా’ అంటూ విశాల్ ఘాటుగా ట్వీట్ చేశారు.

కాగా, మురుగదాస్‌ను అరెస్టు చేయడానికే పోలీసులు ఆయన ఇంటికెళ్లారని వస్తున్న వార్తలపై చెన్నై పోలీసులు స్పందించారు. అసలు మురుగదాస్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, ఆయన్ని అరెస్టు చేసే ఆలోచనే లేదని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘సర్కార్’పై వివాదం నెలకొన్న నేపథ్యంలో మురుగదాస్ ఇంటి వద్ద భద్రతను పరిశీలించడానికి పోలీసులు అక్కడికి వెళ్లారని స్పష్టం చేశారు.

Mobile AppDownload and get updated news

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares