ఆంధ్రప్రదేశ్: ఆ ఊరిలో నైటీలు బ్యాన్!

కాలేజ్ అమ్మాయిలు జీన్స్ ఫ్యాంట్‌లు, పొట్టి స్కర్టులు వేసుకోకూడదనే నిబంధన గురించి విన్నాం. కానీ, మహిళలు సౌలభ్యం కోసం వేసుకునే నైటీలపై కూడా నిషేదం విధించేవాళ్లు ఉన్నారా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, మీరు తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గల నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామానికి వెళ్లాల్సిందే.

ఆ గ్రామ పెద్దలు ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మహిళలు నైటీలు ధరించకూడదని ఆదేశించారు. ఈ నిబంధనల్లో కొన్ని సడలింపులు కూడా చేశారు. మహిళలు రాత్రి వేళల్లో ఇళ్లల్లో ఉన్నప్పుడు నైటీలు వేసుకుంటే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. కానీ, పగటి వేళల్లో నైటీలు ధరించకూడదని, ముఖ్యంగా నైటీలు ధరించి గ్రామంలో తిరిగినట్లయితే రూ.2000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ జరిమానా సొమ్మును గ్రామంలో అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని తెలిపారు.

అంతేకాదండోయ్.. ఎవరైనా పగటి పూట నైటీలు వేసుకున్నట్లు సమాచారం ఇచ్చినట్లయితే.. వారికి రూ.1000 నజరానా కూడా ఇస్తామని ప్రకటించారు. దీనిపై ప్రత్యేకంగా దండోరా కూడా వేశారు. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం నిడమర్రు తమసీల్దారు ఎం.సుందరరాజుకు తెలిసింది. దీంతో ఆయన పోలీసులతో కలిసి గ్రామ ప్రజలను సంప్రదించారు. అయితే, గ్రామ ప్రజలెవరూ తహసీల్దారుకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు.

ఇంతకీ గ్రామ పెద్దలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవల్సి వచ్చిందని ఆరా తీస్తే.. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించేందుకేనని చెప్పారు. అంతేకాదు, ఈ నిషేదం అమలుకు ప్రత్యేకంగా వేళలు కూడా ప్రకటించారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు మహిళలు ఎవరూ నైటీలు వేసుకోకూడదని తెలిపారు. ఈ నిర్ణయాన్ని గ్రామ ప్రజలు కూడా స్వాగతించడం గమనార్హం. ఈ గ్రామంలో సుమారు 3600 మంది జనాభా ఉన్నారు. సంప్రదాయాలు, కట్టుబాట్లలో ఎప్పుడూ ముందుంటారు. అయితే, స్త్రీ సాధికారత కోసం దేశంలో ఉద్యమాలు జరుగుతున్న ఈ రోజుల్లో వారి వస్త్రధారణపై ఆంక్షలు విధించడంపై మహిళాభ్యుదయవాదులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares