కాంగ్రెస్ సీట్ల పంపకాలు.. రేవంత్‌ అసంతృప్తి!

దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న మహాకూటమి టికెట్ల వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 74 మంది అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ అధిష్టానం.. మిగిలిన 19 స్థానాల సీట్ల కేటాయింపులను పెండింగ్‌లో ఉంచింది. ఇదే సమయంలో తాము కోరిన సీట్లతో పాటు తమకు పట్టు ఉందని భావిస్తున్న సీట్లు కేటాయించాలని కోదండరామ్ పార్టీ టీజేఎస్‌కు, సీపీఐ నేతలు కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నారు.

సీట్ల జాబితా ప్రచారం కావడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ తమ అసహనాన్ని బహిరంగంగానే ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పొందిన కీలకనేత రేవంత్ రెడ్డి సైతం అధిష్టానం నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తమ అనుచరుడు చిరమర్తి లింగయ్యకు నకిరేకర్‌ టికెట్‌ ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకుంటామని కోమటిరెడ్డి బ్రదర్స్ బహిరంగంగానే కాంగ్రెస్ హైకమాండ్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పార్టీలో చేరినప్పుడు అధిష్టానం తనకిచ్చిన హామీలను అమలు చేసేందుకు విముఖత వ్యక్తం చేయడంతో రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాను కోరిన సీట్లు ఇస్తే.. ఆ నేతలను గెలిపించుకునే బాధ్యత తనదని, తన అనుచరులకు టికెట్లు ఇవ్వనిపక్షంలో ఎన్నికల బరి నుంచి తాను సైతం తప్పుకుంటానని కాంగ్రెస్ అధిష్టానాన్ని రేవంత్ హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. తన అనుచరులకు టికెట్లు కేటాయించడం లేదని ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఏ క్షణంలో బాంబు పేల్చుతారోనని అధిష్టానం ఒత్తిడికి గురవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మహాకూటమికి గట్టిదెబ్బ తగిలే అవకాశాలున్నాయి.

కాగా, రేవంత్ కోరుతున్న సీట్ల వివరాలిలా ఉన్నాయి. వరంగల్ వెస్ట్ నుంచి నరేందర్ రెడ్డి, రాజారాం యాదవ్ (ఆర్మూర్), అరికెల నర్సారెడ్డి (నిజామాబాద్ రూరల్), సుభాష్ రెడ్డి (ఎల్లారెడ్డి), బిల్యా నాయక్ (దేవరకొండ), బోడ జనార్ధన్ (చెన్నూరు), పటేల్ రమేష్ రెడ్డి (సూర్యాపేట), హరిప్రియ (ఇల్లందు) నియోజకవర్గాల్లో తమ వారికి సీట్లు కేటాయించాలని అధిష్టానాన్ని రేవంత్ కోరినట్లు తెలుస్తోంది.

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares