గెలుపు ముంగిట దక్షిణాఫ్రికా బోల్తా..!

ఆస్ట్రేలియా పర్యటనని ఘన విజయంతో ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు.. రెండో మ్యాచ్‌లో గెలుపు ముంగిట బోల్తాపడింది. గత ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ని ఓడించిన సఫారీ జట్టు.. ఈరోజు అడిలైడ్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో 7 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. మూడో వన్డేల ఈ సిరీస్ 1-1తో సమమవగా.. ఆఖరి వన్డే ఆదివారం జరగనుంది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్.. ఆస్ట్రేలియాని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్ అరోన్ ఫించ్ (41: 63 బంతుల్లో 4×4), క్రిస్‌లిన్ (44: 44 బంతుల్లో 3×4, 3×6), అలెక్స్ కారీ (47: 72 బంతుల్లో 4×4) ఫర్వాలేదనిపించినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 48.3 ఓవర్లలో 231 పరుగులకి ఆలౌటైంది. సఫారీ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టగా.. ప్రిటోరియస్ 3 వికెట్లు తీశాడు.

స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడిన దక్షిణాఫ్రికా జట్టు 14.4 ఓవర్లు ముగిసే సమయానికే డికాక్ (9), మకరమ్ (16), హెండ్రిక్స్ (19), హెన్రిచ్ (14) వికెట్లు కోల్పోయి 68/4తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ డుప్లెసిస్ (47: 65 బంతుల్లో 3×4), డేవిడ్ మిల్లర్ (51: 71 బంతుల్లో 3×4, 1×6) నిలకడగా ఆడటంతో.. ఆ జట్టు కోలుకునేలా కనిపించింది. కానీ.. జట్టు స్కోరు 187 వద్ద మిల్లర్ ఔటవడంతో.. ఒత్తిడిలో పడిన దక్షిణాఫ్రికా ఆఖరికి 224/9కే పరిమితమైంది.

ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా జట్టు విజయానికి 20 పరుగులు అవసరంకాగా.. స్పిన్నర్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో తాహిర్ రెండు ఫోర్లు బాదినా.. ఆఖరికి 12 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆస్ట్రేలియా జట్టులో స్టాయినిస్ మూడు వికెట్లు పడగొట్టాడు.

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares