డీమానిటైజేషన్ మంచి ఆలోచనే: లోకేష్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల్లో డీమానిటైజేషన్(నోట్ల రద్దు) ఒకటి. సరిగ్గా రెండేళ్ల క్రితం తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే గొప్ప ముందడుగని మోదీ ప్రభుత్వం తెగ ప్రచారం చేసుకుంది. రూ.1000, రూ.500 నోట్ల రద్దు కారణంగా బడాబాబుల వద్ద దాక్కున్న కోట్ల రూపాయల నల్లధనం బయటికి వస్తుందని బల్లగుద్ది చెప్పింది. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకురావడానికి ఈ డీమానిటైజేషన్ ఉపకరిస్తుందని తెలిపింది. నల్లధనం ఎంత బయటికి వచ్చిందో తెలీదు కానీ, డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకుని నిన్నటి(నవంబర్ 8)కి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలంతా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

మరోవైపు, డీమానిటైజేషన్ నిర్ణయాన్ని తప్పుబట్టే వాళ్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. వీళ్లలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. డీమానిటైజేషన్ మంచి ఆలోచనే కానీ, ప్రధాని మోదీ దాన్ని చెడగొట్టారని లోకేష్ దుయ్యబట్టారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ‘డీమానిటైజేషన్ మంచి ఆలోచన కానీ దాన్ని సరిగా అమలుపరచలేకపోయారు. ఎవరైనా రూ.1000, రూ.500 లాంటి పెద్ద నోట్లను రద్దుచేసినప్పుడు, వాటి కంటే తక్కువ విలువైన నోట్లను ప్రవేశపెట్టాలి. కానీ మోదీ గారు దీనికి పూర్తి విరుద్ధంగా చేసి రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు’ అని లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మోదీ తీసుకున్న నిర్ణయం ఫలితంగా దేశ జీడీపీ పడిపోయిందని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని, ప్రజలు ఇప్పటికీ తిప్పలు పడుతున్నారని మరో ట్వీట్‌లో లోకేష్ పేర్కొన్నారు. కాగా, లోకేష్ ట్వీట్లకు మిశ్రమ స్పందన వస్తోంది. టీడీపీ అభిమానులు లోకేష్ చెప్పింది ముమ్మాటికీ సత్యం అంటుంటే.. వ్యతిరేకులు మాత్రం అప్పుడేం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు డీమానిటైజేషన్ అమలు చంద్రబాబు నిర్ణయమే అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంతో కలిసున్నప్పుడు డీమానిటైజేషన్ గొప్ప నిర్ణయమని కొనియాడిన మీరు.. ఇప్పుడు బయటికొచ్చేయడంతో తప్పుబడుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

Mobile AppDownload and get updated news

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares