బాలికపై నాలుగేళ్లుగా కీచకపర్వం

చిత్తూరు జిల్లా తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వం నడుపుతున్న బాలికల వసతి గృహంలో ఓ మైనర్ బాలికపై గత నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 12 ఏళ్ల వయసులో ప్రాథమిక విద్య అనంతరం తిరుపతి షెల్టర్ హోమ్‌కు వచ్చిన బాలికపై సూపరింటెండెంట్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఫిర్యాదుతో అతడి అకృత్యాలు బయటపడ్డాయి.

కడప జిల్లాకు చెందిన బాలికకు తల్లి గతంలో చనిపోగా, తండ్రి జీవితఖైదు అనుభవిస్తున్నాడు. 2012లో అప్పర్ ప్రైమరీ స్కూలు విద్య పూర్తయిన తర్వాత ప్రాథమిక ఉన్నత విద్య కోసం తిరుపతిలోని ప్రభుత్వం నడుపుతున్న షెల్టర్ హోమ్‌కు తరలించారు. ఇక అప్పటినుంచీ బాలికకు వేధింపులు మొదలయ్యాయి. తిరుపతి బాలికల వసతి గృహం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న బత్యాల నందగోపాల్ ఆ మైనర్ బాలికను చిత్రహింసలకు గురిచేసేవాడు. రాత్రిళ్లు తన గదికి రావాలని లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. బాలిక అందుకు నిరాకరించగా చావబాది లోబర్చుకునేవాడని మైనర్ బాలిక వాపోయింది.

ఈ క్రమంలో అక్టోబర్ 27న కడపలోని బాలికల వసతి గృహానికి బాధిత బాలికను బదిలీచేశారు. నరకం నుంచి విముక్తి లభించిన బాధితురాలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్‌ శివకామినిని కలిసి తనపై జరిగిన దారుణాలను వివరించింది. ఆమె సమచారం మేరకు తిరుపతి పోలీసులు నిందితుడు నందగోపాల్‌పై ఐపీసీ సెక్షన్ 376తో పాటు పోక్సో చట్టం 2012 ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు.

నిందితుడు నందగోపాల్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. షెల్టర్ హోంలో 150 మంది వరకు బాలికలు ఉన్నారని తాను ఎవరిపై అఘాయిత్యానికి పాల్పడలేదన్నాడు. గత పదేళ్లుగా తాను సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. కడప రిమ్స్ వైద్యుల నుంచి రిపోర్ట్ వచ్చాక నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares