మిజోరం: చిన్న పార్టీలతో కమలం దోస్తీ.. కాంగ్రెస్‌లో కలవరం!

మిజోరంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ సారి గట్టిపోటీయే ఎదుర్కోనుంది. కాంగ్రెస్ ముక్తి భారత్ నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ ఈశాన్య రాష్ట్రాలను ఎలాగైనా కైవశం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో మిజోరంలో తప్పకుండా గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఇక్కడ విజయం సాధించడం అంత ఈజీ కాదు.

మిజోరంలో క్రైస్తవ జనాభా ఎక్కువ. ఇక్కడ బౌద్ధుల జనాభా 8 శాతం. దీంతో బీజేపీ ఇక్కడ ఎన్నిసార్లు పోటీ చేసినా గెలవలేని పరిస్థితి నెలకొంది. బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో అక్కడి స్థానిక పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను వ్యతిరేకించే పార్టీలతో జట్టుకడుతోంది. ఈ నేపథ్యంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) పార్టీకి పరోక్షంగా మద్దతు తెలుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎంఎన్ఎఫ్ రూపంలో గట్టి పోటీయే ఎదురుకానుందని తెలుస్తోంది. అదే జరిగితే.. హ్యాట్రిక్ విజయం కోసం కలలుగంటున్న కాంగ్రెస్ ఆశలకు గండిపడినట్లే. ఈ ఒక్క రాష్ట్రంలో విజయం సాధిస్తే.. ఈశాన్య రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేయాలనే బీజేపీ లక్ష్యం పూర్తవుతుంది.

ఇక్కడి క్రైస్తవ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని బీజేపీ స్థానిక పార్టీలతో నార్త్‌ ఈస్ట్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌‌ను ఏర్పాటు చేసింది. ఇందులో మిజో నేషనల్ ఫ్రంట్ కూడా భాగస్వామిగా ఉంది. అయితే, ఎన్నికల సమయంలో మాత్రం ఈ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేయకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలను బీజేపీ అస్త్రంగా మలుచుకోనుంది. కేంద్రం అందిస్తున్న నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాహా చేస్తుందంటూ స్థానిక బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలను బీజేపీ తమ వైపుకు లాక్కొంటోంది. ఇప్పటికే మాజీ మంత్రి బుద్ధధన్ చక్మ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లాల్ జిర్లియానా మిజో నేషనల్ ఫ్రంట్‌లోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వలసలు కాంగ్రెస్ నేతలను మరింత కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు గట్టిపోటీ తప్పదని తెలుస్తోంది.

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares