శిల్ప మృతికి ప్రొఫెసర్ల వేధింపులే కారణం

తిరుపతిలో సంచలనం సృష్టించిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు విచారణ ముగిసింది. శిల్ప ఆత్మహత్యకు ప్రొఫెసర్ల వేధింపులే కారణమని సీఐడీ తేల్చింది. ఈ మేరకు సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి నివేదికను సిద్ధం చేశారు. డాక్టర్ శిల్ప కేసులో 47 మందిని విచారించినట్లు తెలిపారు. డిజిటల్‌ ఆధారాలు , సిట్‌ దర్యాప్తు బృందం, వివిధ కమిటీల రిపోర్టులను సేకరించామన్నారు. శిల్ప మైగ్రేన్‌తో తీవ్రంగా బాధపడుతూ ఉండేదని.. ఇటు ప్రొఫెసర్లు కూడా లైంగికంగా వేధించారని.. దీనిపై ఫిర్యాదు చేయగా విచారణ జరిపి.. ప్రొఫెసర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

విచారణ తర్వాత కూడా ప్రొఫెసర్ల వేధింపులు ఆగకపోవడంతో శిల్ప కుంగిపోయిందన్నారు అమ్మిరెడ్డి. ముగ్గురు ప్రొఫెసర్లు రవికుమార్, శశికుమార్, కిరీటీ ఆమెను వేధించడంతో ప్రాణాలు తీసుకున్నట్లు తేలిందన్నారు అమ్మిరెడ్డి. శిల్ప మరణానికి భర్త, బంధువులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిందితులు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారని.. ఈ కేసులో త్వరలోనే ఛార్జిషీటును దాఖలు చేస్తామన్నారు.

తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో డాక్టర్ శిల్ప చిన్నపిల్లల విభాగంలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో తనను ప్రొఫెసర్లు రవికుమార్‌, కిరీటి, శశికుమార్‌‌లు వేధిస్తున్నారని ఆమె పోలీసులతో పాటూ, గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. శిల్ప ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్‌ కార్యాలయం విచారణ నిర్వహించాలని ఆదేశించింది. ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఈ ఘటనపై విచారణ జరిపారు. నివేదిక కూడా సమర్పించారు. అయినా డాక్టర్‌ శిల్ప తన సొంతూరు పీలేరులో ఆగస్టు 7న ఆత్మహత్య చేసుకున్నారు. ప్రొఫెసర్ల వేధింపులతోనే శిల్ప ఆత్మహత్య చేసుకుందంటూ మెడికోలు ఆందోళనకు దిగడంతో సీఐడీ విచారణ జరిపారు.

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares