‘సర్కార్’లో ఆ సీన్లు తొలగింపునకు ఓకే!

‘సర్కార్’ సినిమా వివాదం ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. సినిమాలోని అన్నాడీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశాలను తొలగించడానికి, కొన్నింటిని మ్యూట్ చేయడానికి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అంగీకరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ మేరకు ఓ అన్నాడీఎంకే మంత్రి దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు కూడా తెలపడం చూస్తుంటే ఈ వార్త నిజమే అనిపిస్తోంది. దళపతి విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్’ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పొలిటికల్ డ్రామా విడుదలైన తరవాత రోజు నుంచి తమిళనాడులో తీవ్ర దుమారం మొదలైంది.

సినిమాలో ప్రభుత్వం ఇచ్చిన మిక్సీలు, టీవీలు వంటి కొన్ని ఉచిత గృహోపకరణాలను ప్రజలు తీసుకెళ్లి మంటల్లో పడేస్తారు. అంతేకాకుండా గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్ని ఉచితాలపై పరోక్షంగా సినిమాలో పొలిటికల్ సెటైర్లు వేశారు. ఇవన్నీ అధికార అన్నాడీఎంకే పార్టీకి రుచించడంలేదు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన పథకాలను ఈ సినిమాలో తప్పుగా చూపించారని, ఆమెను కించపరిచారని ఆరోపిస్తూ అన్నాడీఎంకే మంత్రులు, నేతలు ఆందోళనకు దిగారు. మంత్రులు సీవీ షన్ముగం, కదంబుర్ సి రాజు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. సినిమాలోని ఆ సన్నివేశాలు తొలగించపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో థియేటర్ల ఓనర్ల నుంచి సన్ పిక్చర్స్‌పై ఒత్తిడి పెరిగిందని అంటున్నారు. ఆ సన్నివేశాలను తొలగించడంతో పాటు కొన్ని డైలాగులను మ్యూట్ చేయాలని కోరారని సమాచారం. దీనికి సమ్మతించిన సన్ పిక్చర్స్ ఆ సన్నివేశాలను తొలగించడంతో పాటు, అభ్యంతరకర డైలాగులను మ్యూట్ చేయాలని నిర్ణయించిందని తెలిసింది. సన్ పిక్చర్స్ తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు మంత్రి ఆర్బీ ఉదయకుమార్ స్పందించారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘జయలలితను కించపరిచే ఏ సన్నివేశాలను అన్నాడీఎంకే అంగీకరించదు. ఉచితాలు రాష్ట్ర సమాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి. ఆఖరికి విజయ్ అభిమానులు కూడా జయలలిత ఉచితాలు పొందినవారే. భవిష్యత్తులో సినీ పరిశ్రమ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ఉదయ్ కుమార్ అన్నారు.

కోర్టుకు మురుగదాస్..
‘సర్కార్’ చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. మురుగదాస్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ఈరోజు మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. ‘సర్కార్’ వివాదం నేపథ్యంలో మురుగదాస్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారు.

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares