‘సర్కార్’ వివాదంపై స్పందించిన రజినీ

దళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘సర్కార్’ సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై తమిళనాట తీవ్ర దుమారం రేగింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను కించపరిచేలా ఉన్నాయని అన్నాడీఎంకే మంత్రులు, పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో నుంచి ఆ సన్నివేశాలు తొలగించాలని హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా గురువారం ‘సర్కార్’ సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్ల వద్దకు వెళ్లి ఆందోళనలు చేపట్టారు. పోస్టర్లు చించి రచ్చ రచ్చ చేశారు. ప్రదర్శనలను అడ్డుకున్నారు.

మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. తన తోటి నటుడికి అండగా నిలిచారు. థియేటర్లపై దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు.

‘ఈ సినిమాకు సెన్సార్ పూర్తిచేసి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలోని సన్నివేశాలు తొలగించాలని ఆందోళనలు చేయడం, సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం, బ్యానర్లు, పోస్టర్లను చించడం వంటి పనులు చట్ట వ్యతిరేకం. ఇలాంటి చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని తలైవా ట్వీట్ చేశారు.

అంతకు ముందు నటుడు, మక్కల్ నీధి మయమ్ చీఫ్ కమల్ హాసన్ కూడా ఈ వివాదంపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. ‘పద్ధతిగా సెన్సార్ పూర్తిచేసుకున్న సర్కార్ లాంటి సినిమాకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఒత్తిడి తేవడం, చట్టాలు తీసుకురావడం కొత్తేమీకాదు. విమర్శలను ఎదుర్కొనే దమ్ములేని ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలి. వ్యాపారవేత్తలుగా మారిపోయిన రాజకీయనేతలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు. మంచోళ్లు పీఠమెక్కుతారు’ అంటూ కమల్ విరుచుకుపడ్డారు.

Mobile AppDownload and get updated news

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares