11న ఏపీ కేబినెట్ విస్తరణ.. కిడారి శ్రవణ్‌కు ఛాన్స్!

న్నాళ్లుగానో ఊరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గాన్ని విస్తరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం (నవంబర్ 11) ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఒక ఎస్టీ, ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థికి మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కే అవకాశం ఉంది. ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రవణ్‌ను ఈ స్థానాల్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇటీవల మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు.. కిడారి కుటుంబసభ్యులను అన్ని విధాల ఆదుకుంటామని ప్రకటించారు. సర్వేశ్వరరావు చిన్న కుమారుడు సందీప్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆయన పెద్ద కుమారుడు శ్రవణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కిడారి శ్రవణ్ వివరాలివే..
వారణాసి ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రవణ్.. ప్రస్తుతం సివిల్స్ లక్ష్యంగా ప్రిపేరవుతున్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే శ్రవణ్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. శ్రవణ్‌ను ఏపీ కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు సీఎంవో అధికారులు కూడా సమాచారం ఇచ్చినట్టు సమాచారం.

మంత్రివర్గ విస్తరణలో భాగంగా పలు మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ఖాళీగా ఉంది. ఓ సీనియర్ మంత్రికి ఆ శాఖ అప్పగించి.. సదరు మంత్రి శాఖను శ్రవణ్‌కు అప్పగిస్తారని తెలుస్తోంది. అలాగే కళా వెంకట్రావు, అచ్చెంన్నాయుడు తదితర మంత్రుల శాఖలను కూడా మార్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

గతేడాది ఏప్రిల్‌లో తొలిసారిగా మంత్రివర్గ విస్తరణ జరిగింది. నిబంధనల ప్రకారం సీఎంతో కలిపి మొత్తం 26 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం.. 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. గతంలో ముస్లిం, మైనార్టీలకు చోటు కల్పిస్తామని చెప్పిన సీఎం.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని భావిస్తున్నారు.

మరి మండలి ఛైర్మన్‌గా ఎవరు?
ప్రస్తుతం ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేదు. దీంతో ఈ రెండు స్థానాలను భర్తీ చేయడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముస్లిం మైనారిటీల్లో రాయలసీమకు చెందిన నేతకే ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో.. ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఆ అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఫరూక్‌ స్థానంలో మండలి ఛైర్మన్‌గా మరో సీనియర్ నేతకు అవకాశం కల్పించనున్నారు.

టీడీపీలో ప్రస్తుతం ముస్లిం మైనార్టీ నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఒకరు ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. మంత్రివర్గంలోకి తీసుకోడానికి వీరిలో ఫరూక్‌కే మెరుగైన అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్టీలకు సంబంధించి.. ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణితో పాటు పోలవరం ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే.. కిడారి శ్రవణ్‌ వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares